Tuesday, March 8, 2011

తెహ్రీర్ నుంచి తెహ్రీర్ కు..


స్క్వేర్ ను చూసావా..
ప్రజలు ఎలా నిలబడ్డారో చూసావా..
జరిగింది మర్చిపోడానికి రక్తం ఎలా నిరాకరిస్తుందో చూసావా..
మతాలు ఒక్కటయ్యి..
ముస్లింలు.. క్రైస్తవులు కలిసి ప్రార్ధించడం చూసావా..
నియంతలపై విప్లవిస్తున్న చోట
నీకు శిలువలు కనబడవు..
నెలవంకలూ కనబడవు..
పూజారులు.. షేకుల నాటకీయ కౌగిలింతలూ కనబడవు..
మాతృభూమి కోసం ఏకమౌతున్న ఆత్మలు కనబడతాయి..
సమున్నతంగా ఎగురుతున్న పతాకాలు కనబడతాయి..
ఒకే దైవం.. ఒకే రక్తం.. ఒకే అస్తిత్వాన్ని నమ్మే ఇద్దరు ఈజిప్షియన్లను చూస్తావు..
తిరుగుబాటును విశ్వాసంలో భాగంగా చూస్తావు..
మతమంటే విధేయంగా ఉండడం మాత్రమే కాదని చూస్తావు..
విప్లవం ఈజిప్ట్ వాసులను వీరులుగా తీర్చిదిద్దడం చూస్తావు..
భయం.. బందిపోట్లు.. భయపడడాన్ని చూస్తావు..
సల్లీ జహ్రాన్ కలలు గన్న ఈజిప్ట్ ను చూస్తావు..
- ఒసామా హిజ్జి..


(సల్లి నిరసన తెలపడానికి తెహ్రీర్ వెళుతుండగా సైన్యం చేసిన దాడిలో తలకు గాయమై మరణించింది. ఇది కవిత కాదు. బాధతో స్రవిస్తూ గుండెను పిండేస్తున్న పదాలు. ఈ పదాలు సల్లీ జహ్రాన్ ఆత్మకోసం అర్పిస్తున్న కానుక. మా దేహాల్లో ప్రాణమున్నంత వరకూ మాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. - ఒసామా హిజ్జి..)

Friday, March 4, 2011

ప్రతి సృష్టి



ప్రతి సృష్టి

నచ్చదు.
చరితకు నచ్చదు.
సూర్యుడు సిగ్గుపడితే నచ్చదు. చంద్రుడు విర్రవీగితే నచ్చదు.
పువ్వులు నవ్వకుంటే నచ్చదు. మబ్బులు ఏడ్వకుంటే నచ్చదు.
నుదుటి మీద బొట్టు గుండ్రంగా లేకుంటే నచ్చదు.
వాకిట్లో ముగ్గు వంకర్లు పోతే నచ్చదు.
అమ్మ తీసే కూనిరాగం అర్థాంతరంగా ఆపేస్తే నచ్చదు.
పక్కింటి పిన్నిగారు, జడవేసుకోవటం బధ్ధకించి ముడివేసుకుంటే నచ్చదు.
పెర్‌ఫెక్షన్‌.. పెర్‌ఫెక్షన్‌.. పెర్‌ఫెక్షన్‌…
ఎవరు ఏ పనిచేసినా అరకొరగా చెయ్యకూడదు.. పరిపూర్ణత్వం వుండాలి.
అందుకే అందరికీ నచ్చిన వాళ్ళు చరితకు నచ్చరు.
పెళ్ళిళ్ళు చేసే పేరిశాస్త్రి బాబాయి అందరికీ నచ్చుతాడు. కానీ చరితకు నచ్చడు.
అప్పడాలు చేసే ఆండాళ్ళమ్మ ఎవరికీ నచ్చదు. కానీ చరితకు నచ్చుతుంది.
పేరిశాస్త్రి ఏ మంత్రమూ పూర్తిగా చదవడు. ఆండాళ్ళమ్మ తిట్ల పురాణం పూర్తి చేయకుండా ఆపదు.
కడకు వీధిలో తన్నుకునే వాళ్ళుకూడా, పైపైన తన్నుకుంటే చరితకు నచ్చదు. ఎవడో ఒకడు
గెలవాలి.
ఎములు విరిచే వాడు పూర్తిగా విరవాలి. అతికే వాడు పూర్తిగా అతకాలి. సగంలో ఆపితే చరితకు నచ్చదంతే.
అలాంటిది… ఆ రోజు రిచర్డ్‌ సర్‌ ఇంగ్లీషు పాఠాన్ని మధ్యలో ఆపేశారు. చరితకు నచ్చుతుందా?
రిచర్డ్‌ సర్‌ పాఠం ఆగటమంటే.. క్లాసులో స్టూడెంట్స్‌ నవ్వులూ, తుళ్ళింతలూ, బల్లలపై చరుపులూ ఆగినట్లే.
ఇంగ్లీషు నాటకాల్ని ఎవరయినా ట్రాజెడీలూ, కామెడీలూ అని రెండు రకాలుగా విభజిస్తే ఆయన నవ్వుకుంటాడు. రిచర్డ్‌ సర్‌ నోట్లో పడితే పరమవిషాదాంత నాటకం కూడా కామెడీ అయిపోతుంది.
బోర్‌డమ్‌ అనేది ఆయనకు తెలీదు. స్టూడెంట్స్‌ కు తెలీనివ్వరు.
అన్నట్టు ఒక సారి ఆయన ‘బోర్స్‌’ (సుత్తి గాళ్ళు) అనే పాఠం చెప్పాల్సి వచ్చింది. అయినా
బోరు కొట్టలేదు. అదే సమయానికి ఎప్పుడూ బోరు కొట్టించే కొత్తిమీర కట్టాచారి( కొత్తిమీర ఇంటి పేరు కాదు.
నిక్‌నేమ్‌)సర్‌ క్లాస్‌రూమ్‌ పక్కనుంచే వెళ్తున్నారు.
‘ఇప్పటి వరకూ బోర్స్‌ గురించి విన్నారు. ఇప్పుడు చూస్తారు’ అన్నారు.
స్టూడెంట్సంతా ఫక్కున నవ్వారు. వెళ్ళే కట్టాచారిసర్‌, ఆగి వెనక్కి గంభీరంగా చూసి, తన
గురించి రిచర్డ్‌ సర్‌ ఏమన్నా ‘అప్రాచ్యపు’ వ్యాఖ్యలు చేస్తున్నాడేమోనని ఆగి, నక్కి వింటున్నాడు.
‘అవర్‌ తెలుగు సర్‌ ప్రొఫెసర్‌ కట్టాచారి హేజ్‌ పాస్సడ్‌ అవే. లెట్‌ అజ్‌ కీప్‌ సైలెన్స్‌ ఫర్‌ ఎ ఫ్యూ
మినిట్స్‌’( కట్టాచారి గారు కాలం చేశారు. కొన్ని నిమిషాలు మౌనం పాటిద్దాం) అన్నారు రిచర్డ్‌ సర్‌.
అందరూ లేచి నిలబడ్డారు.
కట్టాచారి సర్‌ వెనక్కి వచ్చి ‘ ఆ మాత్రం గౌరవం చాల్లే. కూర్చోండి. అలాగని నేను ఇటు వైపు
వెళ్ళినప్పుడెల్లా నిలబడి కండి సుమా!’ అని పరమానందభరితులై వెళ్ళిపోయారు.
అప్పుడు మాత్రం క్లాసు క్లాసంతా గుక్కపట్టి నవ్వింది.
రిచర్డ్‌ సర్‌ గ్రామర్‌ చెప్పినా అంతే.
క్రియలు రెండు రకాలుంటాయి- ట్రాన్సిటివ్‌ వెర్బ్స్‌, ఇన్‌ట్రాన్సిటివ్‌ వెర్బ్స్‌- అని చెప్పటానికి ‘
పెళ్ళయిన క్రియలూ, పెళ్ళికాని క్రియలూ’ అని చెప్పారు ఒక రోజు.
ఆ రోజే తెలిసింది చరితకు – రిచర్డ్‌ సర్‌ ‘పెళ్ళికాని క్రియ’ అని.
ఇక అంతే .ఇంగ్లీషు మీదా, ఇంగ్లీషు టెక్స్ట్‌బుక్‌ మీదా, ఇంగ్లీషు గైడ్‌ మీదా, ఇంగ్లీషు నోట్సు మీదా మాత్రమే కాదు… బజార్లో షాపుల ముందు కనిపించే ఇంగ్లీషు బోర్డుల మీదా, ఆ వూరి డొక్కు థియేటర్లలో
ఆడే ఇంగ్లీషు సినిమాల మీదా చరిత కు మోజు పెరిగిపోయింది.
ఇలాంటి మోజు, చరితకు మాత్రమే వుంటే బాగుండేది. తన క్లాసులో ఇద్దరు మినహా ( వాళ్ళు
‘పెళ్ళయిన క్రియలు’ లెండి) మిగిలిన ఆడపిల్లలందరికీ ఇదే మోజు.
అంత ఇష్టమున్న ఇంగ్లీషు సర్‌, ఇంగ్లీషు పాఠాన్ని, సగంలో ఆపేశారు.
అర్థాంతరం. అర్థాంతరం…అసంపూర్ణం, అసంపూర్ణం…ఇంపెర్ఫెక్ట్‌,ఇంపెర్ఫెక్ట్‌.
సగం చప్పట్లే… సగం నవ్వులే…
అవును. మిల్టన్‌ రాసిందే చెబుతున్నారు. పారడైజ్‌ లాస్ట్‌ …ఇన్‌ ది మిడ్‌ వే. స్వర్గం సగంలో
చేజారింది.
ఆయన తన రిమ్‌లెస్‌ కళ్ళజోడు తీసి అద్దాలను తుడుచుకుంటూ వెళ్ళిపోయారు.
రిచర్డ్‌ సర్‌ కళ్ళల్లో ఎప్పుడూ కొలువుండే నవ్వు లేనట్లనిపించింది.చరితకు నచ్చదు కదా!
వెళ్ళి అడగాలనిపించింది. కానీ ఏమనడుగుతుంది?
….. ….. ….. …..
కాలేజ్‌ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, దారిలో షాపుల ముందు ఇంగ్లీషు బోర్డులను చదవలేక
పోయింది చరిత. ఎందుకో అవి దుమ్ము పట్టివున్నాయి. రిచర్డ్‌ సర్‌ కళ్ళ అద్దాల్లాగా. గోడ మీద ఇంగ్లీషు పోస్టరు
సగం చించేసి వుంది.
ఇంటికి వెళ్ళిందన్నమాటే కానీ.. ఏ పనీ పూర్తి మనసు పెట్టి చెయ్యలేక పోయింది.
స్నానం చేసి, తననితానుతేలికబరచుకోవటానికి, అతి మెత్తనైన దుస్తులు కట్టుకుని మేడపైకి వెళ్ళింది.
సగం కోసిన పిజ్జా లాగా ఆకాశంలో చంద్రుడు… ఆ నాటి రిచర్డ్‌ సర్‌ లాగే.
ఆయన మీద ఎక్కడలేని కోపం వచ్చింది.
అంత కొంపలు ముంచుకొచ్చే పనేముందని.. మధ్యలో అలా వెళ్ళిపోయారు?
పోనీ ఫోన్‌ చేస్తే..?
‘హహ్హహ్హహ్హ…..!’ ఇలాగే నవ్వుతాడు విరగబడి. కానీ అలా కాకుండా పొడిపొడిగా నవ్వితే…!?
కిందకు దిగి వచ్చేసింది.
‘పాడుతా తియ్యగా చల్లగా…పసిపాపలా నిదుర పో తల్లిగా…’ అమ్మ పాత పాటను హమ్‌
చేస్తూ, తన మంచ మీద బెడ్‌ షీట్‌ సాపు చేస్తోంది.
‘ప్లీజ్‌ అమ్మా! ఈ పాట పూర్తిగా పాడవూ..!’ ప్రాధేయపడింది.
‘నాకు రాదు కదుటే…!’ ఆపి నవ్వేసింది చరిత తల్లి భ్రమరాంబ.
‘ప్లీజ్‌… ప్లీజ్‌… మా అమ్మవు కదూ…! ఏదో ఒకటి అల్లేయ్‌.. పాడుతా తియ్యగా… కాక
పోతే, తోముతా తెల్లగా… ఏదో ఒకటి.. ప్లీజ్‌ అమ్మా.. పూర్తి చేసేయ్‌’ అని మంచంమీద మోకాళ్ల మీద నిలబడి
తల్లి గెడ్డం పట్టుకుంది.
‘పోవే..!’ అంటూ పాట ఆపేసి నవ్వుకుంటూ పక్క సర్దుకుంటూనే వుంది.
‘మర్యాదగా పాడతావా? మేజర్‌ ధనుంజయాచార్య గారికి ఫోన్‌ చెయ్యమంటావా?’ చరిత కాస్త బెదరించింది.
‘ఏం మీనాన్నంటే నాకు భయమా? నేను పాడను.. ఓ పన్జెయ్యవే… మీ నాన్ననే ఫోన్లో పాడమను…జనగణమన.. దంచేస్తారు..’ అని మరింత బిగ్గరగా నవ్వింది భ్రమరాంబ.
తన కోసం నాన్నయేదయినా చేస్తారు… పాపం. జనగణమన…పంజాబ్‌ నుంచి కూడా పూర్తిగా పాడగలరు.. కానీ తన మీద బెంగతో మధ్యలో తడబడితే…? గుర్తు రాక పోతే…?
ఆ రాత్రి ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు కానీ.. మెలకువ వచ్చేసరికి రెండయ్యింది.
రిచర్డ్‌ సర్‌ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు కల.
ఫోన్‌ చేసేస్తే..? ఎంత ప్రమాదంలో వున్నారో..? ఆయన ఇంటికే వెళ్ళివస్తే..?
ఇంతటి రాత్రి వేళా..? ఇంకో గంట పోతే మూడవుతుంది. ఏదో ఒక సంచారం మొదలవుతుంది.
గోదావరిలో మూడు గంటలనుంచే మనుషుల్ని దాటిస్తూ వుంటారు.
అలా అనుకుందో, లేదో.. గంటలో రెడీ అయ్యింది.
అమ్మకు తెల్లవారేక ఫోన్‌ చేసి చెప్పవచ్చులే- అనుకుని రోడ్కెక్కింది.
పల్చని గాలి. లేత చివుళ్ళనూ, అప్పుడే పూసిన తాజా పువ్వులను మత్రమే తాకి వచ్చిన గాలి.
ముందురోజు క్లాసులో రిచర్డ్‌ సర్‌ గాలిని బరువుగా పీల్చినట్లనిపించింది. జ్వరం వచ్చినప్పుడు
అంతే. గాలి నిప్పుల్ని తాకివచ్చినట్లనిపిస్తుంది. ‘జ్వరమే వచ్చి వుంటుందేమో!’ అయినా క్లాసయ్యేంత వరకూ
ఓర్చుకోవాల్సింది. మధ్యలో వెళ్ళిపోయారు.
దూరంగా నాలుగురోడ్ల కూడలి వద్ద రిక్షాకు కట్టిన మువ్వలు ఆగి ఆగి మోగుతున్నాయి.
చరితను చూసి రిక్షా తనవైపు తిరిగింది.
రిక్షాఅబ్బాయి పండిన తల గాలికి ఎగురుతోంది.
ఆగగానే.. ‘రేవు’కి అని రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షా పైన గూడు వుండటం- ఆమెకు నచ్చలేదు. చరిత ఆజ్ఞాను సారం గూడు తీసేశాడు రిక్షాబ్బాయి.
రిక్షా పెద్ద రోడ్డెక్కింది. పక్కన కాలువ. రోడ్డు కు ఒక వైపు రాత్రిని సాగనంపటానికి ప్రయత్నిస్తున్న విద్దుద్దీపాలు.
తెల్లవారు ఝామున… వయసులో వున్న అందగత్తె.. రిక్షాలో ఒంటరిగా…
బధ్ధకించి పడుకున్న కుక్కలు మొరిగీ మొరగనట్టుగా మొరిగాయి.
ఎక్కడనుంచి వచ్చాయో రెండు మోటారు బైకులు పక్క సందులో నుంచి వచ్చి రిక్షాను అనుసరిస్తున్నాయి.
తాగి తాగి తేరుకుని వచ్చినట్లుగా వున్న నలుగురు కుర్రాళ్ళు.
చరితకు గుండె ఝళ్ళుమంది. చెవుల్లోంచి వెచ్చటి గాలి వచ్చింది.
‘ఓహో! వెచ్చటి గాలి ముక్కు రంధ్రాల్లోంచి పీలిస్తే జ్వరం. చెవి రంధ్రాల నుంచి వదలితే భయం.
వెను వెంటనే కోపం.. ఆ పై తెగువ…!
‘యమ యమ… యమ యమ… యమ యమ…’
తలపండిన రిక్షా అబ్బాయి గిరుక్కున వెనక్కి తిరిగాడు..అతడు సరిగానే విన్నాడు. ఆమె ‘రామ..రామ..’ అనటం లేదు. ‘యమ’ నామ స్మరణే చేస్తోంది.
‘యముణ్ణి తలుస్తోంది.. చావు భయం కాబోలు’- అని అనుకున్నట్టున్నాడు తలపండిన
రిక్షాఅబ్బాయి. చరిత వైపు చూసి ‘నేనున్నాను కదా..’ అన్నట్లు భరోసాగా తలూపి రిక్షా దిగాడు.
వాళ్ళు అతన్ని చుట్టు ముట్టారు.
అయిదు నిమిషాలు గడిచింది.
తన హ్యాండ్‌ బ్యాగ్‌ లో ఒక చాకు వుండాలి..’ కవ్వింపుగా నవ్వినట్టే నవ్వి.. దగ్గరకు రానిచ్చి…
ఒక్కణ్ణి పొడిచి పారేస్తే…మిగిలిన వెధవలు పరుగు తియ్యరూ…!. యస్‌..యస్‌… ఎవరనుకుంటున్నారు
వీళ్ళు నన్ను? చరిత… డాటర్‌ ఆఫ్‌ మేజర్‌ ధనుంజయాచార్య…’ అని అనుకుని హ్యాండ్‌ బ్యాగ్‌ లో చెయ్యి పెట్టి ధైర్యం తెచ్చుకుంది కానీ పైకి మాత్రం ‘యమ యమ… యమయమ.. యమయమ…’ అనేస్తోంది.
తలపండిన రిక్షాబ్బాయి ఏం చెప్పాడో… అప్పటికే చరితను చూస్తూనే వెనుతిరిగారు ఆ నలుగురూ ‘పోయారు కదమ్మా దొంగ నాయాళ్లు.. ఇంకా యముణ్ణి తలుత్తారేంటీ..?’ అన్నాడు రిక్షాబ్బాయి.
‘యమ- అంటే యముడు కాదోయ్‌..యమగూచి.. కరాటే గురువు లే…!’
రిక్షాబ్బాయి పెద్దగా నవ్వుతూ రిక్షాను కదిలించాడు
‘వాళ్ళకు ఏం చెప్పావు?’ అంది తీయబోయిన చాకును… బ్యాగులోనే వుంచి
‘పోలీసు హెడ్డుగారి కూతురువని చెప్పాను తల్లీ!’
ఇప్పుడు చరిత పెద్దగా నవ్వుకుంది.ఎందుకంటే…’మేజర్‌ ధనుంజయాచార్యను కాస్సేపు హెడ్‌ కానిస్టేబుల్‌ ధనుంజయాచార్యగా ఊహించుకుంది.. అమ్మకు చెప్పాలి.. నవ్వలేక చస్తుంది.’ అనుకుంది.
రేవు రానే వచ్చింది.
తలపండిన రిక్షాఅబ్బాయి చేతిలో వంద పెట్టింది. అతడాశ్చర్యపోలేదు. కృతజ్ఞత ప్రకటిస్తూ, నావలో కూర్చోబెట్టాడు.
తానొక్కర్తే ప్రయాణికురాలు. నావనడిపే కుర్రాడికి పదేళ్ళయినా వుంటాయో లేదో…! చిన్న
బనీనూ, నిక్కరుతో వున్నాడు.
నావ కదిలింది. ఉండీ లేనట్టున్న వెన్నెల.
తెడ్డు వెనక్కీ.. నావ ముందుకీ.. నదితనలో తాను నవ్వుకున్నట్లు నీళ్ళ అలికిడి.
‘రిచర్డ్‌ సర్‌కి ఇప్పుడయినా ఫోన్‌ చేయవచ్చు కదా! జ్వరం వల్ల రాత్రంతా మేల్కొని ఇప్పుడే నిద్రలోకి జారుకుంటే..!’ బ్యాగ్‌లోంచి మొబైల్‌ తీయాలా? వద్దా? అని తటపటాయించింది.
‘టుబీ, ఆర్‌ నాట్‌ టు బీ’ రిచర్డ్‌ సర్‌ పాఠంలోని మాటలు గుర్తుకొచ్చాయి.
నావ పెద్దగా ఊగిసలాడింది. చరిత తుళ్ళిపడింది.
నావ నడిపే కుర్రాడు కిసుక్కుమన్నాడు. ‘బయ్యమేసిందా..?’ అడిగాడు.
‘చంటి వెధవక్కూడా లోకువయ్యానా? ఎటూతేల్చుకోలేనప్పుడు మనుషులు ఇంత బలహీనంగా వుంటారా?’ అనుకున్న చరిత, ‘రేయ్‌! స్పీడు పెంచరా?’ అని ఉడుక్కుంటూ ఆదేశించింది.
కుర్ర సరంగు వేగం పెంచాడు. వాడి భుజాల కండరాలు చకచకా కదిలాయి. ఓహ్‌! వాడి మీద
పడుతున్న వెన్నెలకే కళ వచ్చింది.
ఎక్కుపట్టి వదిలిన విల్లులా నావ ఆవలి వొడ్డును తాకింది.
కుర్ర నావికుడి చేతిలో వంద పెట్టింది. ‘ఊహూ! తక్కువ ఇచ్చినట్లే’ అనిపించి వాణ్ణి దగ్గరకు తీసుకుని తల నెమరింది. ‘నా చిట్టి తండ్రీ! నదినే కాదు..నా మదిలోని ఇరుకు గదిని కూడా దాటించావు
కదరా!’ అని అనుకుంది.
వాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, వందనోటును రెండు చేతుల్తో పైకెత్తి, ఏకబిగిన రెండు
సినిమాలు చూడగల కొత్త సూర్యోదయానికి స్వాగతం పలికాడు.
….. ….. ….. …..
‘రిచర్డ్‌ సర్‌ ఇల్లెక్కడ?’ అనిఅడగ్గానే, ‘ఓహో! పేట లోకా?’ అని పెదవి విరిచాడు పాలబిందెల సైకిల్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఎడమ కాలిమీద ఆగిన ఓ యువకుడు.
అతడు ‘వేలెత్తి చూపిన’ వైపే వెళ్ళింది చరిత
ఏటి వొడ్డున రెల్లుగడ్డితో ప్పిన పర్ణశాల లాంటి ఇల్లు.
కొబ్బరి చెట్ల ఆకులు వడపోయిగా వచ్చిన మేలిమి వేకువ కిరణాలు, సిమెంటు అరుగుల ముంగిట్లో ముగ్గులు పెడుతున్నాయి.
కానీ హఠాత్తుగా టార్చిలైటు పడ్డట్లు చరిత ముఖం మీద కళ్ళు తెరవలేనంతటి తీక్షణమయిన
కాంతి. తేరిపార చూస్తే, వాకిట్లో ఒక మూలగా ఎవరో చిన్నగా, బాలుడిలాగా వున్న వ్యక్తి సూర్యకాంతిని రెండు అద్దాల తో ఎదుర్కొంటున్నట్టుగా కనిపించాడు.
ముందొక అద్దం , వెనుకొక అద్దం, మధ్యలో ఆ వ్యక్తి.
అద్దాలు పీట మీద; అతడు నేలమీద.
దగ్గరకు వెళ్ళేక, లయబధ్దమైన కత్తెర చప్పుడు. జుట్టు కత్తిరిస్తున్నప్పుడు మాత్రమే వచ్చే
శబ్దమది. కానీ అక్కడ ఆ పని చేసే రెండో వ్యక్తి ఎవరూ లేరు.
అబ్బురం. తన జుట్టును తానే కత్తిరించుకుంటున్నాడు… అద్దంలోపలి అద్దంలోపల తన
గుండ్రటి బుర్ర ను ఇరుపక్కలా వీక్షిస్తూ.
చరిత అతని దగ్గరకు వెళ్ళి, తన ఉనికిని తెలియచేసుకోవటానికి బిగ్గరగా గొంతు సవరించింది.
ఆ అద్దాల వ్యక్తి తలయెత్తలేదు. దించలేదు. కానీ,
‘రిచ్చోడా…! ఒరేయ్‌ రిచ్చోడా…!’ అని పెద్ద గొంతు తో పిలిచాడు.. కాదు కాదు. పెద్దవాళ్ల
గొంతుతో పిలిచాడు. వయసులో పెద్దవాడే. సైజులోనే చిన్నవాడు.
‘ఇంకా నయం! ‘పిచ్చోడా’ అని పిలవలేదు’ అని నవ్వుకుంది.
‘ కమింగ్‌, కమింగ్‌… వస్తున్నా చిన్నాన్నా!’
ఇది రిచర్డ్‌ గొంతు. చురుకుగా వున్న స్వరం.’ జ్వరం ఉన్నట్టుగా లేదు. అవునవును. లేనట్టుగా వుంది’ తనలో తాను సర్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది.
బయిటకు వచ్చేశాడు ఖాకి నిక్కరూ, తెల్లటి టీ షర్టుతో రిచర్డ్‌.
‘చెప్పరా రిచ్‌ కన్నా! హిట్లర్‌ కటింగ్‌ ఎలాగుంది?’ తలయెత్తకుండా అడిగాడు పెద్దగొంతున్న
చిన్న వ్యక్తి.
తానొచ్చానని చెప్పటానికే రిచర్డ్‌ను పిలిచాడనుకుంది చరిత అంతవరకూ.
‘బ్యూటిఫుల్‌! మార్వలెస్‌! సర్‌ప్రైజింగ్‌!…!’ రిచర్డ్‌ సర్‌ నోటినుంచి విశేషణాల పరంపర. కానీ
రిచర్డ్‌ సర్‌ వాళ్ళ చిన్నాన్న వైపు చూడకుండా, చరిత ముఖం చూస్తూ చెబుతున్నాడు.
అద్దాల మధ్యనుంచి రిచర్డ్‌ సర్‌ వాళ్ళ చిన్నాన్న లేచాడు. అయినా అంతే పొట్టిగా వున్నాడు.
‘ఏమిటీ? ఇప్పుడూ? ఇలా?’ ఇలాంటి ఆశ్చర్యాలతో కూడా ప్రశ్నలు రిచర్డ్‌ సర్‌ వేసేయ్యటమూ,
చరిత సమాధానాలు ఇచ్చెయ్యటమూ, అందుకతడు పగలబడినవ్వటమూ, ఆనవ్వుల్లో ఆమె శ్రుతికలపటమూ
పూర్తవ్వగానే
‘అయితే. నీ కోసం జ్వరపడాలన్నమాట! గుడ్‌! ‘ అని చెప్పి ,
‘చిన్నాన్నా! కొంచెం జ్వరం కావాలి’ అన్నారు రిచర్డ్‌ సర్‌.
‘తెస్తాన్రా రిచ్చోడా!’ అంటూ ఇంటి వెనుకకు పరుగెత్తాడు రిచర్డ్‌ సర్‌ వాళ్ళ చిన్నాన్న. చరిత ఆయనవైపే చూసింది. ఇంతకుముందు తనను నది దాటవేసిన నావ సరంగుకూ ఈయనకీ ఏమీ తేడాలేదు.
చిన్న బనీనూ, చిన్న నిక్కరూ.
….. ….. ….. …..
‘ఒరేయ్‌ చిన్నా! ఏంట్రా ఆ దూకుడూ! నీకు పెళ్ళి చెయ్యాల్రా!’ అంటూ ఒకామె ఇంటి వెనుక
నుంచి ఆయనకు ఎదురవుతూ వచ్చింది.
చరితకు ఆమె తెగ నచ్చేసింది. ఒత్తెన వంకీల జుట్టుకు వదులుగా వేసిన ముడి. చామన ఛాయ. ఎలా చూసినా నవ్వుతున్నట్లుండే కళ్ళు. పెదవులమీద నర్తించే వెటకారం.
ఆమె చేతిలో ఒక ట్రే వున్నట్లూ, అందులో పొగలు కక్కే రెండు కాఫీ కప్పులున్నట్లూ , ‘చరితా!
హేవ్‌ ఇట్‌!’ అని రిచర్డ్‌ సర్‌ అనేంత వరకూ చరిత చూడలేదు.
‘బావోయ్‌! ఈవిడ పిల్ల కాదురా! బొమ్మరా!’ ఇద్దరికీ కాఫీ అందిస్తూ అంది.
‘అవునవును. అమ్మాయి కాదు. బొమ్మాయి.’ అని రిచర్డ్‌సర్‌ వంత పాడారు.
చరిత కొంచెం ఆనందంతో, కొంచెం కోపంతో ఇబ్బంది పడింది. తాను తెల్లగా, ఆకర్షణీయంగా
వుంటుందని మాత్రమే తెలుసు కానీ, తన ప్రత్యేకతలేమిటో తనకీ తెలీవు.
‘లిటిల్‌ రిచ్‌ ఏడే! నువ్వొక్కదానివే తిప్పుకుంటూ వచ్చావ్‌!’ అంటూనే అరుగు మీద వున్న
రెండు కుర్చీలూ వాకిట్లోకి తెచ్చాడు రిచర్డ్‌ సర్‌.
‘దొర స్కూలుకు పోనంటున్నాడు. రోజూ బస్సుమీదేనా? అంటున్నాడు. విమానం
తెప్పిస్తావేమోనని అడగటానికొచ్చాను’ అంది రిచర్డ్‌ సర్‌ మరదలు.
‘నిన్నెక్కిస్తాలే విమానం. వాణ్ణి ఆటోలో పంపు. కుర్రసన్నాసికి కళలెక్కువ’ అంటూ జేబులోంచి
యాభయిరూపాయిలు తీసి ఇస్తూ ఆమె నెత్తిమీద కొట్టారు రిచర్డ్‌ సర్‌.
‘బొమ్మా! పొద్దుకుంకే దాకా వుంటావు కదా! మళ్ళొచ్చి చూస్తాను’ అని చెప్పేసి నిజంగానే తిప్పుకుంటూ వెళ్ళి పోయింది రిచర్డ్‌ సర్‌ మరదలు.
ఆమె గురించి రిచర్డ్‌ సర్‌ చెబుతారని ఆశించింది.
….. ….. ….. …..
అందం. అందం. చుట్టూరా అందం. చెట్ల అందం. పక్కనే నది అందం. మనుషుల అందం.
ప్రకృతిలా మనుషులున్నారా? మనుషుల్లా ప్రకృతి వుందా?
దాపరికం లేదు. అంతా పారదర్శకత. పారదర్శకతే అందం.
ఆమె మూడ్‌కు సరిపోయేలా తలంబ్రాలు పడ్డట్టు నెత్తి మీద నీటి తుంపరలు.
రిచర్డ్‌ సర్‌ కూడా తడుస్తున్నారు. ఆయన కళ్ళజోడు మీద చినుకులు.
ఇద్దరి చేతుల్లో వున్న ఖాళీ కాఫీ కప్పులు.. మళ్ళీ నిండుతున్నాయి.
‘వర్షం!’ అంది చరిత.
‘కాదు.జ్వరం!’ అన్నారు రిచర్డ్‌ సర్‌.
కప్పులు నిండిపోయాయి. దెయిర్‌ కప్స్‌ ఆర్‌ ఫిల్డ్‌ విత్‌ జోయ్‌!
‘చిన్నాన్నా! చాలు! జ్వరమొచ్చేసింది. నువ్వు దిగివచ్చేయ్‌!’ అంటూ పైకి చూశారు రిచర్డ్‌ సర్‌.
కొబ్బరి చెట్టు కు వెళ్ళాడుతున్న రిచర్డ్‌ సర్‌ వాళ్ళ చిన్నాన్న స్వామి.. చిన్న కోతిపిల్లలా..ఆయనకు ఒక తోక కూడా. పొడుగాటి ఎర్రటి ప్లాస్టిక్‌ ట్యూబ్‌. దానితోనే ఆయన నీళ్ళు విరజిమ్ముతున్నాడు.
‘రిచ్చోడా! నూటొక్క డిగ్రీలు రానీయ్‌!’ అంటూ ఇద్దరినీ మొత్తం తడిపేశాక కానీ చెట్టుదిగిరాలేదు
స్వామి.
‘అయ్యయో! మొత్తం తడిసిపోయావేే! ఎలాగిప్పుడూ?’ అంటూ రిచర్డ్‌ సర్‌ అటూ, ఇటూ చూశారు.
అప్పటికే కిందకు దిగి తువ్వాలుతో తల తుడుచుకుంటున్నాడు స్వామి.
‘చిన్నాన్నా! ఈమెను ఉతికేశావ్‌ కదా! ఆరెయ్యాలి’ ఆదేశించి రిచర్డ్‌ సర్‌ లోనికి వెళ్ళారు.
చరితకు వెంటనే అలాంటి అవసరం కలగలేదు. వర్షించిన ఆనందాన్ని వెంటనే తుడుచుకోవాలనుకోవటం లేదు.
స్వామి వాషింగ్‌ పౌడర్‌ కలిపిన నీళ్ళతోనూ, స్పాంజీ ముక్కతోనూ వచ్చాడు.
తన తెల్లటి చీర మీద, పడ్డ అతి చిన్న మట్టి మరకల్ని కూడా పోల్చుకున్నాడు స్వామి. రిచర్డ్‌ సర్‌ ఖాళీ చేసిన కుర్చీ ఎక్కి కూడా వాటిని స్పాంజ్‌ తో తుడిచేశాడు.
‘రండి! ఆరెయ్యాలి. రిచ్చోడు చెప్పాడు కదా!’ అని వెళ్ళి గాలిపటంతో తిరిగి వచ్చాడు.
అప్పటికే ముదిరిన ఎండ కాస్త వేడిగా. గోదావరి గాలి కొంచెం చల్లగా
స్వామి చిన్న చేతుల్లోంచి గులాబి రంగు గాలి పటం గోదావరి ఒడ్డున గాలిలోకి విముక్త మవుతోంది.
చరితకు తెలియకుండా చరిత మనసుకు రెక్కలు మొలుస్తున్నాయి.
పైకి.. పైపైకి.. చూడటానికి తల పైకెత్తలేనంత పైకి వెళ్ళి పోయింది. గాలిపటం ముచ్చటైన తోకతో పల్టీలు కొడుతోంది. విన్యాసాలు చేస్తోంది.
ఆకాశంలో వున్న గాలిపటానికీ, భూమికి జానెడు వున్న స్వామికీ అనుబంధం.. కేవలం అతి సన్నని దారం.
ఆ అనుబంధం మొత్తాన్ని చరిత చేతుల్లో పెట్టాడు స్వామి. దారం చుట్టి వున్న కండి(చరఖా)ని
ఆమె కిచ్చాడు.
గాలి పటం ఎటు వెళ్ళితే అటు పరుగెత్త మన్నాడు.
చరిత మనసుకు రెక్కలు పూర్తిగా విచ్చుకున్నాయి.
అందం. ఆకాశమంత అందం. గాలిపటం లాంటి అందం. స్వేఛ్చే అందం. అందమే స్వేఛ్చ.
అన్నీ మరచి పరుగెత్తింది. పరిమితులు లేని పరుగు అది.
గంట క్షణంలా గడిచింది.
చప్పట్లు. చప్పట్లు. దగ్గరగా చప్పట్లు, దూరంగా చప్పట్లు.
దగ్గర గా స్వామి. దూరంగా తమ ఇంటి పెరటి నుంచి రిచర్డ్‌ సర్‌ చప్పట్లు.
‘రిచ్చోడా! ఆరేశా!’ అని స్వామి చెప్పే వరకూ, తనను తాను చూసుకోలేదు చరిత.
ఆమె ఒంటి మీద చీర పొడి పొడిగా..తళ తళగా.. కళ కళగా…!
కండిని తిరిగి స్వామి చేతికిచ్చేసి రిచర్డ్‌ సర్‌ ఇంటి వైపు నడిచింది చరిత
….. ….. ….. …..
‘చరితా! వెలకమ్‌ టు మై బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌!’ అని తన పర్ణశాలలోకి తీసుకువెళ్ళారు రిచర్డ్‌ సర్‌. హాల్లో అంతా కేన్‌ తో చేసిన ఫర్నిచర్‌. వాటిలోని కుషన్‌ సీట్లూ, సీటు కవర్లూ, కప్పిన లేసులూ మల్లె
పువ్వులంతా తెల్లగా.
కేన్‌ సోఫా లో పొందిగ్గా కూర్చుంది చరిత.
తెలుపులో తెలుపు. తెలతెల్లని తెలుపు. ఎదురుగా వచ్చిన తెలుపు.
ఆమె రిచర్డ్‌ సర్‌ మరదలు. గంట క్రితం చూసినట్టుగా లేదు. ఎంతో గొప్పగా.. ఎంతో ఠీవిగా..
ఎంతో హుందాగా…!
‘హియర్‌ కమ్స్‌ ది నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా! అసలు పేరు ఫ్లారెన్స్‌.’ ఎట్టకేలకు పరిచయం
చేశారు రిచర్డ్‌ సర్‌.నర్స్‌ యూనిఫాంలో ఆమె తేజస్సును చూసింది చరిత.
ట్రేలో ఇద్దరికీ రెండు ప్లేట్లలో రెండు మినపట్లు.. పొగలతో తెచ్చి ముందు పెట్టింది.
పక్కనేపారదర్శకమైన నీళ్ళ గ్లాసులను జాగ్రత్తగా వుంచింది.
అనాలోచితంగా ముక్క విరిచి నోట్లో పెట్టుకోబోయింది చరిత. నాలుక కన్నా ముందు పెదవులు
చుర్రుమన్నాయి.
అంతే.. పసిపిల్లను తీసుకున్నట్లు చరితను దగ్గరగా తీసుకుని, మునివేళ్ళను గ్లాసుల్లోని చల్లటి నీళ్ళతో ముంచి చరిత పెదవుల మీద మెల్లగా అద్దింది ఫ్లారెన్స్‌
అప్పుడు ఫారెన్స్‌ కళ్ళ వైపు చూసింది. ఎంతో ఇష్టంగా చేస్తోందాపనిని.
‘బావోయ్‌! ఈ బొమ్మకు లిప్‌స్టిక్‌ అక్కర్లేదురా!’ అని అనేసి, మినపట్టును చిన్న చిన్నగా
విరుస్తూ, చట్నీలో ముంచుతూ ఆమె చరితకు తినిపించింది.
అమ్మ ఇలాగే చేస్తుంది కదా! అందుకే అమ్మకు అంత అందం!
సేవే అందం. అందమే సేవ.
మినపట్టు తరిగిపోకుండా వుంటే బాగుండుననుకొంది చరిత.
‘చిన్నాన్నా! బొమ్మ!’ అని రిచర్డ్‌ సర్‌ ఆరిచారు.
మందంగా వున్న తెల్లని కాగితాన్ని, క్లిప్పు వున్న అట్టకు పెట్టుకుని, ఒక పెన్సిల్‌ చెవిలోనూ,
ఇంకొక పెన్సిల్‌ చేతిలోనూ పెట్టుకుని వచ్చాడు స్వామి.
‘ఫ్లారెన్స్‌ దానా? నువ్వలాగే కదలకుండా తినిపించవే’ అని స్వామి కాలాన్ని పావుగంట సేపు
నిలిపేశాడు.
తర్వాత చూస్తే నిజంగా నే బొమ్మ. గీతల్లో నిజమయిపోయిన ఒక అమృత ఘడియ.
‘రిచ్చోడా! బొమ్మ రెడీ!’ అనాడు స్వామి
‘అయితే ఆది తీసుకున్నట్టేలే! పని చూడు’ అన్నారు రిచర్డ్‌ సర్‌
‘బొమ్మా! నేను డ్యూటీకి వెళ్ళొస్తా. వచ్చేదాకా కదలకే..!’ అంటూ వెనక్కి చూస్తూ చూస్తూ వెళ్ళిపోయింది ఫ్లారెన్స్‌.
….. ….. ….. …..
ఇక హాలులో రిచర్డ్‌ సర్‌, చరితల మధ్య మహదానంద భరితమయిన ఏకాంతమే మిగిలిపోయింది.
ఆనందమొక నిషా! ఏదయినా చేయిస్తుంది. ముఖమాటాన్ని వలచి అవతల పారేస్తుంది.
‘ ఇప్పుడు చెప్పండి సర్‌! పాఠం మధ్యలో ఆపేసి నిన్న ఎందుకు వచ్చేసారు?’ సూటిగా అడిగేసింది చరిత.
‘ఇంకో పని పూర్తి చెయ్యటానికి!’ రిచర్డ్‌ సర్‌ కూడా తడుము కోకుండా చెప్పేస్తూ పైకి లేచారు.
‘ ఆ పనేమిటో నేను వినవచ్చా?’
‘చూడ వచ్చు’
హాల్లోంచి లోపల గదిలోకి వెళ్ళటానికి కర్టెన్‌ తొలగించారు రిచర్డ్‌ సర్‌.
ఎదురుగ్గా స్టాండ్‌ మీద పెయింటింగ్‌!
చరిత!
అవును. చరిత చరితనే చూస్తున్నది.
కళ్ళు చెదిరాయి. కళ్ళు చెమర్చాయి. కను రెప్పలు తడిసాయి. రెప్పల కొసలకు నీటి బొట్లు
చేరాయి. కిటికీలోంచి, కిటికీ వేలాడే తెరల్లోంచి, బొట్లు మిలామిలా మెరుస్తున్నాయి-పొద్దున్నే పచ్చగడ్డిని పట్టుకుని వేళ్ళాడే మంచు బిందువుల్లాగా.
పెయింటింగ్‌ లో వున్న చరిత మనిషిలాగా..
చూస్తున చరిత పెయింటింగ్‌ లాగా..
‘క్లాస్‌ రూమ్‌ లో నిన్న సంపూర్ణమైన నీ ముఖం చూసినప్పుడు, నాకు సగంలో ఆపిన ఈ
పెయింటింగ్‌ వెంటాడింది. నచ్చలేదు. దిగులు కలిగింది. పాఠాన్ని అర్థాంతరంగా ముగించాను..’ ఇంకా ఏమిటో
చెబుతున్నారు రిచర్డ్‌ సర్‌. చరిత వినటం లేదు. వినాల్సిన అవసరం లేదు.
ఈ పెయింటింగ్‌- ఇంతకుముందు స్వామి బొమ్మలో లాగా ఘనీభవించిన ఒక మధుర ఘట్టం కాదు.
ఇది ప్రతిరూపం.
చూస్తుంటే చరితకు తన అంతరంగం కనిపిస్తోంది. ఫోటోలోనూ, అద్దంలోనూ చూసుకోలేని తన
పోలికలు.
తన ధైర్యమూ, తన భయమూ కలగలిసిన పోలిక.
తన హుందాతనమూ, చిలిపితనమూ మిళితమయిన మూడ్‌.
తప కోరికలూ, తన అసంతృప్తులూ బహిర్గతం చేసే ఎక్స్‌ప్రెషన్‌.
చదివేశారు. రిచర్డ్‌ సర్‌ తన హృదయాన్ని మొత్తం చూసేశారు.
తెలిసి పోయి వుంటుంది. తాను ఏమి వెతుక్కుంటుందో ఆయనకు తెలిసిపోయివుంటుంది.
జ్వరం వంక. రిచర్డ్‌ సర్‌ మీద ఇష్టం నిజం.
రిచర్డ్‌ సర్‌ గమనించేసి వుంటారు. నవ్వుకుని కూడా వుంటారు.ఛీ!ఛీ! ఇక్కడేమీ
దాచుకోకూడదు. దాచుకుంటే దొరికి పోతారు.
‘సర్‌! నేను చాలా చిన్న దాన్ని కదా!’ రెండు చేతుల్తో ముఖం దాచుకుంది.
‘కాదు. పసిదానివి.’ అని ఆమె చేతుల్ని ముఖం మీద నుంచి తొలగిస్తూ నవ్వాడు రిచర్డ్‌.
‘ప్లీజ్‌ సర్‌. నవ్వకండి సర్‌..నాకు ఏడుపువస్తుంది. అయ్యో! అ యామ్‌ ఎషేమ్డ్‌ ఆఫ్‌ మై సెల్ప్‌.
సిగ్గుగా వుంది.’ అని మళ్ళీ ముఖం దాచుకోబోయింది.
‘చిన్నాన్నా! సిగ్గు! రెడీయేనా?’ అన్నారు రిచర్డ్‌ సర్‌.
‘రిచ్చోడా! రెడీ’ అన్న స్వామి సమాధానమూ, కుట్టు మిషన్‌ ఆగిన చప్పుడూ ఒకే సారి
వచ్చాయి. కొన్ని అంతే ఆగిపోయాక కానీ, అంతవరకూ అవి పనిచేస్తున్నాయన్న స్పృహే కలుగదు.
క్షణంలో ఎర్రటి చీరా, ఎర్రటి బ్లౌజూ ఆమె ముందుంచి వెళ్ళిపోయాడు స్వామి.
‘ చరితా! ఇవి కట్టుకుంటే ఇంకాస్త సిగ్గుపడవచ్చు. కట్టుకోక పోతే నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా
ఊరుకోదు.’ అని రిచర్డ్‌ సర్‌ కూడా బయిటకువెళ్ళిపోయారు.
తానుచిన్నబోతోంది.మరింతచిన్నబోతోంది. ‘ఛా.. రాకుండా వుండాల్సింది.’ అనుకుంది
చరిత
చీరా,జాకెట్టు పెట్టేశారు కదా- భోజనం కూడా పెట్టేసి, ‘బుధ్ధిగా చదువుకో తల్లీ! ఇలాంటి పిచ్చి
ఆలోచనలు పెట్టుకోకు’ అని రిచర్డ్‌ సర్‌ క్లాసు పీకి పంపిస్తారు కాబోలు అని అనుమాన పడింది కూడా.
‘అవునూ! అసలు రిచర్డ్‌ సర్‌ ‘పెళ్ళికాని క్రియే’నా? మరి ఈ నైటింగేలేమిటో..? నిండా
మునిగాక చలేమిటి? ఎలాగూ ఆయన పట్ల తన కున్న ఇష్టం తెలిసి పోయింది. బహుశా ఆయన ‘ఒక లేకి,
చవకబారు ఆకర్షణ- అని అనుకోవచ్చు. అనుకుంటే అనుకోనీ! ఇంత వరకూ ఎలాగూ వచ్చింది.
పెళ్ళాడతారా?- అని నేరుగా అడిగేస్తే…?
ఇలా అనుకుంటూనే తాను కొత్త చీర, కొత్త బ్లౌజులోకి వొదిగి పోయింది.
అద్దంలో చూసుకొంది. పెళ్ళికూతురులా వుంది. కానీ ముఖంలోంచి సిగ్గు మొత్తం పోయింది.
నిర్ణయం తీసుకున్నాక సిగ్గూ, ఎగ్గులూ పారిపోవాల్సిందే.
తలుపు భళ్ళున తెరుచుకుని వచ్చింది.
‘రిచ్చోడా! చెప్పానా? కరెక్టుగా సరిపోతుందని’ అన్నాడు స్వామి- ఆమెను చూసి.
అప్పుడు కానీ ఆమె గమనించుకోలేదు. తనకు బ్లౌజు అంత ఖచ్చితంగా సరిపోయినట్లు.
ఆశ్చర్యంగా రిచర్డ్‌ సర్‌ వైపు చరిత చూసింది.
‘మా చిన్నాన్న నీ బొమ్మ గీతల్లో వేశాడు కదా! దాని ప్రకారమే కుట్టాడు!.’ అన్నాడు రిచర్డ్‌
సర్‌. చరిత కృతజ్ఞత ప్రకటిద్దామనుకునే లోగానే తుర్రుమన్నాడు స్వామి.
చరితకు సిగ్గయితే పోయింది కానీ, రావాల్సినంత తెగింపు రావటం లేదు.
మధ్యాహ్నం భోజనం అయ్యింది. క్లాసు పీకటం ఖాయం అనుకుంది .కానీ అప్పుడు కూడా అడగలేదు.
కానీ, రిచర్డ్‌ సర్‌ తనని హాల్లోనే కూర్చోబెట్టి కొన్ని పుస్తకాలు పారేసి, తన గదిలోకి వెళ్ళి
నిద్రపోయారు. బహుశా రాత్రంతా మేల్కొని పెయింటింగ్‌ పూర్తి చేసి వుంటారు.
తన పెయింటింగే రిచర్డ్‌ సర్‌ ఎందుకు వెయ్యాలి? అనుకుంది కానీ, పెయింటింగ్‌ తెలిసిన వారు వందమంది చిత్రాలు గీస్తారు. అని సమాధానం చెప్పేసుకుంది. ఏమయినా ‘అడిగేస్తాను. ఆయన నిద్రలేవనీ’ అని ఈ సారి ధృఢంగా అనుకుంది. మనసు తేలిక పడింది. కూర్చునే కునుకు తీసింది.
….. ….. ….. …..
‘బావోయ్‌! బొమ్మ నిద్రలో కూడా అందంగా వుంది.’ అని ఫ్లారెన్స్‌ అనుకుంటూ రావటమూ
‘స్లీపింగ్‌ బ్యూటీ’ అని రిచర్డ్‌ సర్‌ కామెంట్‌ చెయటమూ వినబడి లేచింది చరిత.
సాయింత్రమయిపోయినట్టుంది. ఫ్లారెన్సు ఆఫీసునుంచి వచ్చెయ్యటమూ, టీ రెడీ చెయ్యటమూ
పూర్తయ్యింది.
‘వేరీజ్‌ లిటిల్‌ రిచర్డ్‌. దొర ఆటోలో దిగాడా?’ అని రిచర్డ్‌ సర్‌ అడగ్గానే,
‘ఆడెక్కడొస్తాడు? నేను వెళ్ళి తీసుకురావాలి?’ అంటూ వెళ్ళి ఫ్లారెన్స్‌ వెళ్ళిపోయింది.
మరో మారు ఏకాంతం. ఇది చిట్ట చివరి అవకాశం. చరిత వదలుకోదలచుకోలేదు.
‘సర్‌! మీ జీవితంలో నాకు చోటిస్తారా?’ అడిగేసింది చరిత.
రిచర్డ్‌ సర్‌ పగలబడి నవ్వలేదు. వేళాకోళం చెయ్యలేదు.
‘ఆర్‌ యూ సీరియస్‌?’ అన్నారు రిచర్డ్‌ సర్‌
‘అవును సర్‌!’ అంది చరిత.
హాల్లో అటూ ఇటూ నడిచి..
‘చరితా! ఐ హావ్‌ ఎ కన్‌ఫెషన్‌ టు మేక్‌. ఒక నిజం ఒప్పుకోవాలి. నీ మనసును ఆకర్షించింది నేనే. నువ్వే నలైఫ్‌ పార్టనర్‌వి కావాలనుకున్నాను. ఐ విల్‌ఫుల్లీ డిడ్‌ ఇట్‌!’ అన్నారు.
చరిత నవ్వుకుంది. ఏడ్చుకుంది. ఊపిరిబిగబట్టుకుంది. ఊపిరి బరువుగా వదులుకుంది.
‘ఐ యామ్‌ లక్కీ సర్‌’ అని పైకి అనేసింది.
‘నో! యు ఆర్‌ అన్‌లక్కీ. నాకో చంటాడున్నాడు.’ అని రిచర్డ్‌ సర్‌ చెప్పేశారు.
‘లిటిల్‌ రిచర్డ్‌.. లిటిల్‌ రిచర్డ్‌ … అని ఫ్లారెన్స్‌ తో అంటున్నది .. ఆ కుర్రాడే కాబోలు… అంటే ఫ్లారెన్స్‌తో రిచర్డ్‌ సర్‌కి… ‘ ఈ ఊహను కొనసాగించటానికి ధైర్యం చాలలేదు చరితకి.
ఈ బాంబు పేల్చాక రిచర్డ్‌ సర్‌ తనగదిలోకి తాను వెళ్ళి పోయారు.
‘చిన్నాన్నా! బులెట్‌!’
‘రిచ్చోడా! అరగంటలో రెడీ’
ఈమాటలుమాత్రంఆమెకువినిపించాయి.కొంచెం గాభరా పడింది.
‘బులెట్‌ ఎందుకు? కాల్చటానికా? కాల్చుకోవటానికా? నేనే ఆయనకు సమస్య అయ్యాను.
నన్నే కాల్చేస్తే పోలా..? ఈ రోజు పొందిన ఆనందం, చూసిన అందమూ చాలు.. హాయిగా పోవచ్చు. కానీ,
మేజర్‌ ధనుంజయాచార్య, తన కూతుర్ని కాల్చేస్తే ఊరుకుంటారా? రిచర్డ్‌ సర్‌ కుటుంబాన్నే తుడిచెయ్యరూ?
పాపం! రిచర్డ్‌ సర్‌, ఫ్లారెన్స్‌, లిటిల్‌ రిచర్డ్‌, అమయాకపు స్వామి.. అందరూ చచ్చిపోతారు. వద్దు.. రిచర్డ్‌ సర్‌
బతకాలి. అందరూ బతకాలి. అందుకు నేనేమయినా చేస్తాను. ఏ త్యాగమయినా సరే!’ ఇలా అనుకుంటే జీవితం
మళ్ళీ అందంగా కనపడింది చరితకి.
త్యాగమే అందం. అందమే త్యాగం.
అరగంట గడిచిపోయింది.
‘రిచ్చోడా! బులెట్‌ రెడీ’
‘వస్తున్నా చిన్నాన్నా!’
బూడిద రంగు టీ షర్టు వేసుకుని చాలా కాజుయల్‌గా బయిటకు వచ్చారు రిచర్డ్‌ సర్‌. చరితను
వెంటరమ్మన్నట్టు సైగ చేశారు.
‘రెండు చక్రాలకీ పంక్చరేరా రిచ్చోడా! ప్యాచ్‌లు వేసేసాను. తీసుకో నీ బులెట్‌’ అని తనకన్నా ఎత్తయిన సైకిల్‌ పట్టుకుని నిలబడ్డాడు స్వామి.
చరిత ఊహించినట్టుగా ఏదీ జరగటం లేదు. అంతా కొత్త కొత్తగా.. వింత వింతగా.. ఆకాశంలో మబ్బును చూసి దిగులు పడ్డప్పుడు రంగుల హరివిల్లు రావటం… ఎంత అందం! ఎంత వింత!
అనుకోనిదే అందం…అందమే అనుకోనిది.
‘చరితా! ఇదుగో నీ చోటు’ ఎడమ కాలు నేల మీదనే వుంచి సైకిల్‌ సీటు మీద కూర్చుని, కుడి
చేత్తో హాండిల్‌ బార్‌ పట్టుకుని తన ముందుకి ఆహ్వానించారు రిచర్డ్‌ సర్‌. ఇదీ ఊహించలేదు చరిత. ఉత్సాహంగా
వెళ్ళి కూర్చుంది. సైకిల్‌ కదిలింది. పరుగెడుతున్న సెకిల్‌ వెనుక సీటు మీద ఎగిరి కూర్చున్నాడు రిచర్డ్‌ సర్‌ వాళ్ళ చిన్నాన్న స్వామి.
రిచర్డ్‌ సర్‌ ఊపిరికి దగ్గరగా తాను. ఇది కూడా ఊహించలేదు చరిత.
‘మీ చిన్నాన్న గారికి రాని విద్య లేదనుకుంటున్నాను.’ అన్నది చరిత ప్రయాణంమొదలయ్యాక.
‘అవును. తనకు తానే బార్బర్‌. వాషర్‌మన్‌, కార్పెంటర్‌, డాక్టర్‌, టైలర్‌, మెకానిక్‌. అన్ని వృత్తులూ తెలుసు. కానీ బతకటమే తెలీదు. ‘ అన్నారు రిచర్డ్‌ సర్‌.
‘ఎందుంటారు?’
‘మనిషి ని చూడలేదా? ఎంత పొట్టిగా వున్నాడో? విద్యల్ని నేర్చుకున్నాడు. ఎదగటం
మరచిపోయాడు.’
‘అసలు ఒకరికి ఇన్ని విద్యలు ఎలా వస్తాయి? ‘
‘ బయిటకు గెంటేస్తే…!’
‘అంతేనా?’
‘అంతే…ఇప్పుడు ఇంగ్లీష్‌ సర్‌తో చరిత లేచిపోతుంది. ఇంగ్లీష్‌ సర్‌ కు ఒక్క వంట మాత్రమే
వస్తుంది. మిగిలిన విద్యలన్నీ చరిత నేర్చుకోవాల్సిందే. ఇల్లు శుభ్రం చెయ్యాలి. పిల్లలు పుడితే వాళ్ళకు స్నానం
చేయించాలి. వాళ్ళకు హెయిర్‌ కట్‌ చెయ్యాలి. పచ్చళ్ళు పట్టుకోవాలి. వాళ్ళకి ట్యూషన్‌ చెప్పుకోవాలి. వాళ్ళకు చిట్కా వైద్యాలు చేయించాలి.’
‘అందుకు మా మేనత్త వుంటుంది’
‘లేచిపోయిన అమ్మాయి ఇంటికి మేనత్తలూ, అమ్మమ్మలూ వస్తారేమిటి. దె విల్‌ ఎక్స్‌కమ్యూనికేట్‌ యూ. వెలి వేస్తారు.’ అని ఏడిపిస్తూ నవ్వారు రిచర్డ్‌ సర్‌.
చరిత చిన్నగా ఉడుక్కుంది.
‘కానీ, మీరు మీ చిన్నాన్న గారిని వెలివెయ్యలేదు కదా!’ ఎదిరించ బోయింది.
‘యూ నో.. మా చినాన్న లాంటి వారు మా వాడలో కనీసం ఇంటికొకరు వుంటారు. ఊళ్ళో ఒక్కొక్కరికీ ఒక్కటే వృత్తి వస్తుంది. కానీ మా వాడలో ప్రతీ ఒక్కరికీ అన్ని వృత్తులూ రావాలి. ఇది వెలివాడ.
దిస్సీజ్‌ ఘెట్టో… నాట్‌ అ విలేజ్‌… అర్థమయిందా! అని చరిత నెత్తి మీద చనువుగా కొట్టాడు రిచర్డ్‌ సర్‌. ఇదీ ఆమె ముందు ఊహించలేదు.
ఈ లోగా సైకిల్‌ కదిలింది.
రిచర్డ్‌ వాళ్ళ చిన్నాన్న స్వామి కిందకు ఉరికాడు.
ఎదురుగా గోదావరి రేవు. అప్పకటికే చీకటి పడిపోయింది.
నేల మీద కాలు ఆన్చి సైకిల్‌ ఆపాడు రిచర్డ్‌ సర్‌
నావలూ, నావల్లో ప్రయాణించే మనుషులూ, నడిపేసరంగులూ అందరూ నీడల్లాగే కనిపిస్తున్నారు.
చరితకు సైకిల్‌ దిగటం ఇష్టం లేదు.
‘దిగాల్సిందేనా సర్‌! మా ఇంటికి వెళ్ళి పోవాల్సిందేనా సర్‌!’ గారాబాలు పోతూ అయిష్టంగా
సైకిల్‌ దిగింది.
‘వెళ్ళాల్సిందే’
‘చీకటంటే నాకు భయం సర్‌. దయ్యాలుంటాయి.’ అంది గారాబాలను పెద్దవి చేస్తూ.
‘చిన్నాన్నా! దయ్యం!’ అన్నాడు రిచర్డ్‌ సర్‌
‘రిచ్చోడా! తరిమేస్తా!’ అంటూ దిగాడు వాళ్ళ చిన్నాన్న స్వామి.
కొంచెం దూరంగా వెళ్ళి ఒడ్డున ముసుగుగా వున్న కొబ్బరి చెట్లలోకి చూస్తూ స్వామి
మాట్లాడటం మొదలు పెట్టాడు: ‘ఆలిఖాన్‌! ఆలిఖాన్‌! ఇప్పుడు రాకు. మా ఇంట్లో పప్పు వండుతున్నాం.
రేపొచ్చెయ్‌. మటన్‌ బిర్యానీ చేస్తా..! ఆలిఖాన్‌ రేపు తప్పకుండా వచ్చేయ్‌!’
‘ఎవ్వరా ఆలిఖాన్‌!’ అడిగింది చరిత
‘దయ్యం. మా చిన్నాన్న కు చిన్నప్పట్నుంచీ తెలుసు. బుక్కాసాయిబు. తిండిలేక చచ్చిపోయాడంటారు. అందుకని మా చిన్నాన్న బిర్యానీ ఆశ చూపిస్తాడు.’ అన్నాడు రిచర్డ్‌ సర్‌
‘రిచ్చోడా! ఆలీఖాన్‌ పోయాడు’ అంటూ వెనక్కి పరుగెత్తుకొచ్చాడు.
‘అయినా సరే! నేను వెళ్ళను బాబూ! నాకు భయం’ అంటూ రిచర్డ్‌ సర్‌ దగ్గర గా వచ్చి వొదిగిపోయింది.
‘అయితే ఒక పని చెయ్యి. చంటాణ్ణి తోడుగా తీసుకుని వెళ్ళు. రేపు ఎలాగూ మనం పెంచుకోవాలి కదా!’ అన్నాడు రిచర్డ్‌ సర్‌.
‘చంటాడా! ఏ చంటాడు?’ అత్యంత ఆశ్చర్యమూ, అత్యంత ఉత్సాహమూ కలిపేసి అడిగింది చరిత.
‘ఈ చంటాడే… అవును ఈ స్వామే.. ఈ చిన్నాన్నే..! ఈయన్నే కదా మనం పెంచుకొనేది..!? అన్నారు రిచర్డ్‌ సర్‌.
‘మరి.. లిటిల్‌ రిచర్డ్‌..?’
‘అమ్మా! ఆశ. వాళ్ళమ్మ నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా ఇస్తుందేమిటి? ఒక వేళ ఆమె ఇచ్చినా,
వాళ్ళనాన్న ఊరుకుంటాడేమిటి? అసలే మిలట్రీవాడు. మీనాన్నంత పెద్దవాడు కాపోయినా. గట్టి సిపాయి.
నన్నూ, నిన్నూ కాల్చి పారేస్తాడు.’ చల్లని కబురు హాట్‌ హాట్‌గా చెప్పారు రిచర్డ్‌ సర్‌.
చరిత మనసు ఎగిరెగిరి పడింది. ఊహించని మహదానందం.
రిచర్డ్‌ వాళ్ళ చిన్నాన్న నిజంగా పసిపిల్లాడిలాగా కనిపించాడు.
సృష్టికి ప్రతి సృష్టిని చెయ్యగల వాడు. వృత్తికి ప్రతివృత్తిని కనిపెట్టగలిగిన వాడు. బుల్లి విశ్వామిత్రుడు.
చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు.
‘చిన్నా!’
పిలిచింది చరితే. అలా పిలవాలనిపించింది. చేతులు చాస్తూ పిలిచేసింది. నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా ఇలాగే పిలుస్తుంది.
రిచర్డ్‌ సర్‌, తనూ, చిన్నా- ఒక సంపూర్ణ జీవిత చిత్రం.
సంపూర్ణత్వమే ఆనందం. ఆనందమే సంపూర్ణత్వం.
————————-v

One Response to ప్రతి సృష్టి

  1. venkat on February 10, 2011 at 9:00 pm
    super sir
    anduke meeru sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
*

maro pooru

Tuesday, March 1, 2011

వడ్డి తాండ్ర ప్రజలకు జేజేలు..

తూర్పు తీరం మరో సారి పోటెత్తింది. అభివృద్ధి పేరుతో థర్మల్ కేంద్రం.. దాని సాకుతో భూముల సేకరణ.. వీటన్నిటికి శ్రీకాకుళం ప్రజలు మరోసారి బ్రేక్ వేసారు. గృహదహనాలు.. పోలీసు కాల్పులకు బెదరబోమన్నారు. పదిరోజుల నుంచే వడ్డితాండ్ర.. సమీప గ్రామాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. సంత బొమ్మాళి మండలంలోని తంపర గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రజలను భయభ్రాంతుల్ని చేసారు. చివరికి ఇద్దరు ప్రజల్ని ప్లాస్టిక్ బుల్లెట్స్ తో బలిగొన్నారు. స్థానిక నాయుకుల మద్ధతు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంఘీభావం.. అన్యూహంగా ప్రభుత్వంపై వత్తిడి పెంచింది. దాంతో కేంద్రప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ విజయం సంతబొమ్మాళి తంపర వాసులది. వారికి నైతిక మద్ధతు ఇచ్చిన తెలుగు ప్రజలది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవాలి. అభివృద్ధి.. ప్రజల ప్రయోజనాలు పరస్పర వ్యతిరేకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజలు ఎన్నుకున్న నాయుకులది. ఆ విషయం విస్మరిస్తే వడ్డితాండ్రలు పునరావృతమవుతూనే ఉంటాయి.