Saturday, February 19, 2011

సంఘం శరణం గచ్ఛామి..



బుద్ధుడు.. అంబేద్కర్.. జీసస్.. మహ్మద్ ప్రవక్త..
కార్ల్ మార్క్స్.. లెనిన్.. మావో జెడాంగ్..
గాంధీ.. మండేలా.. ఆంగ్ సాన్ సూకీ..
వంద పూలు వికసించినా..
వేయి ఆలోచనలు సంఘర్షించినా..
సంఘం శరణం గచ్చామి జీవనమంత్రంగా సాగాలనే ఆకాంక్షతో ఎందరో మిత్రులు తమదైన కృషి చేస్తూనే ఉన్నారు. వారందరినీ ఏకం చెయ్యగల సామాజిక శక్తికి సంఘమిత్ర ఒక భూమికగా పనిచెయ్యగలిగితే బాగుంటుంది. రకరకాల అభిప్రాయాలు.. ఆలోచనలు.. తత్వాలు.. ఇప్పటికే తెలుగునేలపై బలంగానే వేళ్ళూనుకున్నాయి. సామాజిక శాస్త్రాలు.. మతాలుగా మారిపోతున్న చారిత్రక సంధికాలంలో.. సిద్ధాంతాలను ఒక సైన్స్ గా చూడగలిగిన ఒక దృక్కోణం అవసరమనిపిస్తుంది. సైన్స్ లో కొన్ని నియమాలు అనునిత్యం మారుతున్నట్టు.. సమాజంలో కూడా నియమాలు ఎలా మారుతున్నాయో పరిశోధించగలిగే సామాజిక శాస్త్రవేత్తలు కావాలి. అది ఆచరణ నుంచే వస్తుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒక నందిగ్రామ్.. ఒక సోంపేట.. రంగురంగుల ముసుగులు తొలిగిస్తున్న సంధికాలంలో.. ఒక కాశ్మీర్.. ఒక తెలంగాణ.. జాతుల సమస్యను తిరిగి ఎజెండా మీదికి తీసుకొస్తున్న వేళ..
మన గతాన్ని మనమే శోధించుకోవాలి..
మన భవిష్యత్ మనమే దర్శించుకోవాలి..
మన వర్తమానాన్ని మనమే నిర్మించుకోవాలి..
ఈ బృహత్తర కర్తవ్యంలో సంఘమిత్ర ఓ ఇసుకరేణువుగా మిగిలినా సార్ధకత లభించినట్టే..
నేను.. నువ్వు.. కలిసి మనంగా మారేందుకు తలా ఒక చెయ్యి వేద్దాం రండి..
మిత్రులారా.. ఇదే ఆహ్వానం..

1 comment: