Saturday, February 26, 2011

మేం గర్విస్తున్నాం

అవును. మేం సిగ్గు పడడం లేదు. గర్విస్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును మనస్పూర్తిగా అభినందిస్తున్నాం. దాన్నో వీరోచిత ఘట్టంగానూ, స్పూర్తిదాయక సంఘటనగానూ మా హృదయ ఫలకాల మీద ముద్రించుకుంటున్నాం. రేపటి తెలంగాణ చరిత్రలో ఈ సంఘటనను సువార్ణక్షరాలతోనే లిఖించుకుంటాం. నిండు సభలో ఏదో అపచారం జరిగినట్టుగా ఎవరూ బాధపడాల్సిన పని లేదు. కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు.

అనుమానం లేదు.  డిసెంబర్ 31 తరువాత జనవరి ఫస్టే వస్తుందని ఎకసెక్కాలడిన గవర్నర్ కు జరగవలిసిన పరాభవమే జరిగింది. డిసెంబర్ 31 తరువాత జనవరి ఫస్టే కాదూ ఫిబ్రవరి 17 కూడా వస్తుందనే విషయం బహుశా గవర్నర్ నరసింహన్ కు ఇప్పుడు అర్ధమై వుంటుంది.  ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ఎలా తిరగబడాలో  అలాగే తిరగబడ్డ మా తెలంగాణ బిడ్డలకు జేజేలు. ఇది అనైతికమూ కాదూ: అరాచకమూ కాదు; అసహజమూ కాదు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, ప్రసంగ ప్రతులు చింపివేయడం తప్పు కానేకాదు. గవర్నర్ కుర్చీలో కూర్చున్న నరసింహన్ నిష్పక్షపాతంగా వ్యవహిస్తున్నారని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి, ఆయన ప్రసంగాన్ని మైమరచి వినాల్సిన అవసరం తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేదు.  మొన్నటి ఉప ఎన్నికల్లో టియ్యారెస్ ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీలు ఇచ్చి గెలిపించింది - వారిని ఎమ్మెల్యేలుగా చూసుకుని మురిసిపోవడానికి కాదు. సమైక్యాంధ్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ కు చప్పట్లు చరిచి, బిల్లులు ఆమోదించుకుంటుంటే చూస్తూ కూర్చోవడానికీ కాదు. తమ తరుపున అసెంబ్లీలో పోరడడానికీ,  అసెంబ్లీని స్తంభింపచేసైనా తెలంగాణ సాధించుకుని రావడానికే భారీ మెజార్టీ లు ఇచ్చారు. ఈ లెక్కన చూసినప్పుడు వారు తమ కర్తవ్యాన్ని  ఫిబ్రవరి 17న చక్కగానే నిర్వర్తించారు.


సమైక్య రాష్ట్రాన్ని కాపాడే  కాపలా కుక్క పాత్రలో తనను తాను ఇముడ్చుకుంటున్న గవర్నర్ కళ్లలో కనిపించిన భయం తెలంగాణ బిడ్డల ధీరత్వానికి సంకేతం. మున్ముందు కూడా ఇదే పోరాట పటిమను ప్రదర్శిస్తారనే ఆశిద్దాం.  సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం ఏ ఒక్క క్షణం సజావుగా సాగినా, సమైక్యాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాంక్షించే ఏ ఒక్క బిల్లు ఆమోదం పొందినా ఆ మేరకు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా అయినట్టే లెక్క. అసెంబ్లీ నిర్వహణకు అయ్యే ఖర్చులో సీమాంధ్ర ప్రజల సొమ్మే కాదు- తెలంగాణ ప్రజల సొమ్ము కూడా వుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా, సజావుగా సాగడం సమైక్యవాదులకు ఎంత అవసరమో, వాటిని అడుగడుగునా అడ్డుకోవడం తెలంగాణవాదులకు అంతే అవసరం.  ఈ  స్పృహ లోపించినవారికి అసెంబ్లీలో జరిగినదంతా అరాచకంగానూ, అసాధారణంగానూ, అనూహ్యంగానూ, అవాంఛనీయంగానూ, దురదృష్టకర సంఘటనగానూ కనిపించడంలో ఆశ్చర్యం లేదు.  ఈ స్పృహ లోపించింది కాబట్టే లోక్ సత్తా నేత జయప్రకాష్  మీడియా పాయింట్ లో నోటికొచ్చినదంతా మాట్లాడారు. భారతీయులకు పరిపాలించుకోవడం చాతకాదు. వారికి స్వాతంత్ర్యం ఎందుకంటూ విన్ స్టన్ చర్చిల్ చేసిన వంకర వ్యాఖ్యలను ఉటంకించి, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల స్వేచ్ఛా పిపాసను  కించపరిచే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలే ఆయన మీద దాడికి కారణమయ్యాయి. ఆయన నోరు పారేసుకున్నారు. వీళ్లు చేయి చేసుకున్నారు! ఇలాంటివాళ్లను చూసే నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందనే సామెత పుట్టింది.  కాబట్టి, ఎప్పుడూ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే జయప్రకాష్ లాంటి వాళ్లు తమ వంకర బుద్ధులు, వంకర మాటలు, వంకర చేష్టలు మానుకోవడం మంచిది. ప్రజాస్వామిక విలువల మీద నిజమైన ఆపేక్ష ఉన్నవాళ్లు మరింత బాధ్యతాయుతంగా మాట్లాడడం, ప్రవర్తించడం నేర్చుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు జయప్రకాష్ లో ఈ స్పృహ ఏనాడూ కనిపించలేదు. తెలంగాణ ప్రజలకు ఒక మిత్రుడిగా  దగ్గరయ్యే ప్రయత్నం ఆయన  ఏనాడూ చేయలేదు.  తెలంగాణ ఉద్యమం కొత్త దశలో ప్రవేశిస్తున్న ఈ సమయంలో ఇలాంటి దాడులు వ్యూహాత్మకంగా కరెక్టా? కాదా?  వాటి వల్ల మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే విషయాన్ని తెలంగాణ ఉద్యమ నాయకత్వం సమీక్షించుకోవాలి. అంతేతప్ప ఏదో అపచారం జరిగినట్టుగా బాధపడాల్సిన పనేమీ లేదు. జయప్రకాష్ మీద జరిగిన దాడిని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా చూడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామిక ముసుగు తొడుక్కొని, కౌరవ పక్షపాతిగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తి మీద జరిగిన దాడిగానే చూడాలి. ప్రజాస్వామిక పోరాటాల పట్ల ఆయన తన మైండ్ సెట్ మార్చుకుంటే ఈ కాస్త గౌరవమైనా మిగులుతుంది.
కృష్ణప్రసాద్ 18/2/2011





Saturday, February 19, 2011

సంఘం శరణం గచ్ఛామి..



బుద్ధుడు.. అంబేద్కర్.. జీసస్.. మహ్మద్ ప్రవక్త..
కార్ల్ మార్క్స్.. లెనిన్.. మావో జెడాంగ్..
గాంధీ.. మండేలా.. ఆంగ్ సాన్ సూకీ..
వంద పూలు వికసించినా..
వేయి ఆలోచనలు సంఘర్షించినా..
సంఘం శరణం గచ్చామి జీవనమంత్రంగా సాగాలనే ఆకాంక్షతో ఎందరో మిత్రులు తమదైన కృషి చేస్తూనే ఉన్నారు. వారందరినీ ఏకం చెయ్యగల సామాజిక శక్తికి సంఘమిత్ర ఒక భూమికగా పనిచెయ్యగలిగితే బాగుంటుంది. రకరకాల అభిప్రాయాలు.. ఆలోచనలు.. తత్వాలు.. ఇప్పటికే తెలుగునేలపై బలంగానే వేళ్ళూనుకున్నాయి. సామాజిక శాస్త్రాలు.. మతాలుగా మారిపోతున్న చారిత్రక సంధికాలంలో.. సిద్ధాంతాలను ఒక సైన్స్ గా చూడగలిగిన ఒక దృక్కోణం అవసరమనిపిస్తుంది. సైన్స్ లో కొన్ని నియమాలు అనునిత్యం మారుతున్నట్టు.. సమాజంలో కూడా నియమాలు ఎలా మారుతున్నాయో పరిశోధించగలిగే సామాజిక శాస్త్రవేత్తలు కావాలి. అది ఆచరణ నుంచే వస్తుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒక నందిగ్రామ్.. ఒక సోంపేట.. రంగురంగుల ముసుగులు తొలిగిస్తున్న సంధికాలంలో.. ఒక కాశ్మీర్.. ఒక తెలంగాణ.. జాతుల సమస్యను తిరిగి ఎజెండా మీదికి తీసుకొస్తున్న వేళ..
మన గతాన్ని మనమే శోధించుకోవాలి..
మన భవిష్యత్ మనమే దర్శించుకోవాలి..
మన వర్తమానాన్ని మనమే నిర్మించుకోవాలి..
ఈ బృహత్తర కర్తవ్యంలో సంఘమిత్ర ఓ ఇసుకరేణువుగా మిగిలినా సార్ధకత లభించినట్టే..
నేను.. నువ్వు.. కలిసి మనంగా మారేందుకు తలా ఒక చెయ్యి వేద్దాం రండి..
మిత్రులారా.. ఇదే ఆహ్వానం..